స్పెషల్

పది గంటల్లో ఇంటి నిర్మాణం …66 వేలకే సొంతిల్లు!

పిల్లర్లతో పనిలేకుండా స్టీల్‌ ఫ్రేములు..కొబ్బరి పీచు, థర్మకోల్‌తో గోడలు.. మొత్తం ఖర్చు రూ.3లక్షలే..కట్టినచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్లొచ్చు

‘ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు’ అంటారు. ఓ వ్యక్తికి జీవితంలో ఈ రెండు కార్యాలు చాలా కష్టసాధ్యం అనే ఉద్దేశంతో ఈ నానుడి పుట్టింది. వీటిలో పెళ్లితో పోల్చుకుంటే ఇల్లు కట్టడం మరీ కష్టం. చేతిలో సరిపడా డబ్బు ఉన్నా స్థలంతో మొదలు పెడితే.. ఇటుకలు, ఇసుక, స్టీల్‌, సిమెంటు తదితర సామాగ్రిని సమకూర్చుకొని కట్టడం అంటే నెలలకొద్దీ ప్రయాసే! మరి.. ఈ ఇబ్బందులన్నీ పోయి, గంటల వ్యవధిలోనే సర్వాంగ సుందరంగా ఇల్లు సిద్ధమైతే? అదీ ఇటుకలు, ఇసుక గట్రా వాటితో పనిలేకుండానే సాధ్యపడితే? ఇది నూటికి నూరుపాళ్లూ సాధ్యమని బెంగళూరుకు చెందిన సొసైటీ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ కంపోజిట్స్‌ అన సంస్థ నిరూపించింది. నగర శివారులోని కేంగేరీ ఉపనగర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది. పది చదరపు అడుగుల స్థలంలో కేవలం పది గంటల్లోనే రూ.3లక్షలలోపు ఖర్చుతో ఇంటిని నిర్మించింది. ఈ వినూత్న ప్రయోగాన్ని బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్‌, రాష్ట్ర వసతి శాఖ మంత్రి ఎం.క్రిష్ణప్పలు శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సరికొత్త నిర్మాణ పథకం నిరుపేదల పాలిట వరప్రసాదమన్నారు. పైగా ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానం మేరకు ఇలాంటి ఇంటికి రెండు అడుగుల పునాది సరిపోతుంది. ఈ సరికొత్త నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలను, ఇతర పరికరాలను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఒకసారి ప్లానసిద్ధం చేసి ఇస్తే చాలు… 30 మందితో కూడిన బృందం 10 గంటల్లోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది.

నిర్మాణం ఇలా…
ఇంటి నిర్మాణంలో విమానాలకు ఉపయోగించే లైట్‌గేజ్‌ స్టీల్‌ ఫ్రేమ్‌లను వాడతారు. ఎన్ని అంతస్తులైనా సరే పిల్లర్లతో పని లేకుండానే స్టీల్‌ ఫ్రేములను అమర్చుతారు. గోడలకు ఇటుక బదులు కొబ్బరి పీచు లేదా థర్మాకోల్‌ను వినియోగిస్తారు. దీంతో ఈ ఇంటినిర్మాణానికి ప్రతి చదరపు అడుగుకు రూ.1,200 మాత్రమే ఖర్చు అవుతుందని నిపుణులు అంటున్నారు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఇలాంటి ఇళ్ళను నగర శివారు ప్రాంతాల్లో నిరుపేదలకోసం నిర్మించే ఆలోచన ఉందని మంత్రి క్రిష్ణప్ప వెల్లడించారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఇంటిని చాలా తక్కువ ఖర్చుతో ఉన్నచోటు నుంచి మరో చోటుకు కొన్ని గంటల వ్యవధిలోనే తరలించవచ్చు.

మరొక ఇల్లు 66 వేలకే కట్టవచ్చు

66 వేలకే సొంతిల్లు

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు. సామాన్య మధ్యత రగతి కుటుంబాలకు ఆర్థికంగా అత్యంత భారమైన పనులివి. సాంకేతిక అభివృద్ధి చాలా రకాల సేవలను తక్కువ ధరకు, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నా, ఇంటి నిర్మాణంలో సౌకర్యాల అభివృద్ధి జరుగుతోంది కానీ ఖర్చు విషయంలో మాత్రం తగ్గుదల లేదింత వరకూ. సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము.. ఇలా ప్రతీదీ ఖరీదే. ఇలాంటి పరిస్థితుల మధ్య వియత్నాం పరిశోధకులు సరికొత్త గృహ నమూనాను ఆవిష్కరించారు. నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ‘ఎస్ హౌస్’ నిర్మాణానికి సంబంధించి తాజాగా నమూనాను ప్రదర్శించారు. కేవలం వెయ్యి డాలర్ల (భారత ద్ర వ్యమానంలో దాదాపు రూ.66 వేలు) ఖర్చుతో పూర్తి నిర్మాణం పూర్తయ్యే ఈ ఇంటి విశే షాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఇల్లు ప్రీ మార్కెట్ దశలో ఉంది. త్వరలోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం.. ఆ తర్వాత అమ్మకానికి పెట్టడం అంతే! ఇల్లేమిటి ఉత్పత్తి చేయడం ఏమిటి? అంటే… ఈ ఇంటి విషయంలో అంతే. కాంక్రీట్ ఫౌండేషన్, వుడెన్ ఫ్లోర్, స్టీల్ ఫ్రేమ్, స్టీల్ షీట్ రూఫ్, ఒక స్టీల్ డ్రైనేజ్‌గటర్… వీటిని వేరువేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చుకుంటే చాలు ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది.

మూడు గంటల్లో నిర్మాణం.. 30 ఏళ్ల జీవితం…పై సరంజామాతో ‘ఎస్ హౌస్’ను అమర్చడానికి మూడు గంటల సమయం పడుతుందని రూపకర్తలు చెబుతున్నారు. కనీసం ముప్పై సంవత్సరాల పాటు ఈ ఇంటిలో దర్జాగా నివ సించవచ్చని హామీ ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇల్లు చెక్కుచెదరదని అంటున్నారు.

340 చదరపు అడుగుల ఇల్లు..ఫార్ములా ప్రకారం వెయ్యి డాలర్ల వ్యయం తో 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. అదనంగా వెచ్చించి ఇంతకంటే విశాలంగా కావాలన్నా నిర్మించుకోవచ్చు, ఒకటికి మించిన స్థాయిలో ఇళ్లను జాయింట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

సిమెంట్, ఇసుక అవసరం లేదు..ఈ ఫార్ములాలో పేర్కొన్న సరంజామా తప్ప నిర్మాణంలో అదనంగా ఎలాంటి అవసరాలూ ఉండ వు. అక్రమ రవాణా పాలవుతూ ధర విషయంలో కొండెక్కిన ఇసుక కానీ, సిమెంట్ కానీ, ప్రత్యేకంగా ఇనుము కానీ కొనాల్సిన అవసరం ఉండదు.

తుప్పుపట్టదు, చెదలు దరిచేరవు..ఈ నిర్మాణంలో ఉపయోగించే వుడ్‌కు, స్టీల్‌కు చెద, తుప్పు భయాలుండవని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలు గడిచినా కూడా అవి చెక్కుచెదరవని చెబుతున్నారు.

ప్రకృతి వైపరీత్యాలనూ ఎదుర్కొనగలదు..రాళ్లతో కట్టిన పునాదులేమీ లేకపోయినా, భారీగా ఖర్చు పెట్టకపోయినా… టైపూన్లు, హరికేన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడే స్థాయిలో ఈ నిర్మాణం ఉంటుంది.

ప్రస్తుతానికి వియత్నాంలో..అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘ఎస్ హౌస్’ ప్రణాళికను ప్రారంభించారు. ఇప్పుడు ఇది ప్రొటోటైప్ దశ వరకూ వచ్చింది. అతి త్వరలోనే వియత్నాంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని దేశాల్లోని పేదలందరికీ ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి వనరులను సమకూర్చే లక్ష్యం ఉంది రూపకర్తలకు. మరి వారి లక్ష్యం సిద్ధించి… మనదేశంలోని గుడిసెలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆశిద్దాం.

SEARCH GOOGLE ABOUT THIS HOUSES GET MORE INFORMATION